హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్ నిధులను పెంచాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏబీవీపీ ప్రతినిధులు గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డికి వినతిపత్రం సమర్పిచారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ బడ్జెట్ రూ.380 కోట్లయితే, బ్లాక్ గ్రాంట్‌గా కేవలం రూ.120 కోట్లే ఇస్తున్నారని చెప్పారు.
ఇలాగే వర్సిటీలన్నీ నిధుల కొరతతో సతమతమవుతున్నాయని తెలిపారు. బ్లాక్ గ్రాంట్ నిధులు ఇవ్వకపోవడంతో వర్సిటీలు ఫీజులు పెంచాల్సి వస్తున్నదని చెప్పారు. రానున్న బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం 15శాతం నిధులు కేటాయించాలని, టీఏఎఫ్ఆర్సీ అన్ని రకాల ఫీజుల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ప్రతినిధుల బృందంలో ఏబీవీపీ రాష్ట్ర నేతలు జీవన్, పృథ్వీ తదితరులు ఉన్నారు.