హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిని ముట్టడించింది. కార్యకర్తలను పోలీసులు గేట్ ఎదుటే ఆపగా కొందరు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది.
కొందరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎట్టకేలకు పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకొన్నారు. రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు. అడ్మిషన్ సమయంలో పూర్తి ఫీజులు వసూలు చేయడం అన్యాయమని వాపోయారు. విద్యార్థి నాయకులపై లాఠీచార్జ్ చేయడాన్ని ఖండించారు.