హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. శనివారం తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డికి ఏబీవీపీ బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వీతేజ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడేండ్లకు ఒకసారి పెరిగే ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులను ఇష్టారీతిన పెంచడానికి ప్రతిపాదనలు పంపిన టీఏఎఫ్ఆర్సీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
కళాశాలలు తప్పుడు ఆడిట్ లెకలు చూపిస్తూ ఫీజులు పెంచుకొని పేద విద్యార్థుల దగ్గర లక్షలకు లక్షలు డబ్బులు వసూలు చేయడానికి సిద్ధం అవుతున్నాయని ఆరోపించారు. తప్పుడు ఆడిట్ లెకలు చూపించిన కళాశాలలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.