అచ్చంపేటటౌన్/అమ్రాబాద్, జూలై 9 : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో ప్రాజెక్టు ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం అల్పాహారంలో కిచిడీ తీసుకున్నారు. తర్వాత కొద్దిసేపటికే ఆహారం వికటించి 26 మంది అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి, సిబ్బంది హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఏరియా దవాఖానకు విద్యార్థులను తరలించారు.
26 మంది విద్యార్థుల్లో చరణ్, గణేశ్, రామాంజనేయులు వాంతులతో.. మిగిలినవారు కడుపునొప్పితో బాధపడుతూ వచ్చారని డాక్టర్ మహేశ్ తెలిపారు. వారంతా కోలుకోవడంతో డిశ్చార్జి చేసినట్టు చెప్పారు. దవాఖానలో సరిపడా బెడ్లు లేకపోవడంతో విద్యార్థులను నేలపై పడుకోబెట్టి చికిత్స అందించారు. అదనపు కలెక్టర్ దేవసహాయం, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, డీఎస్పీ శ్రీనివాసులు అచ్చంపేట దవాఖానకు చేరుకొని విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన్ననూర్ పాఠశాలలో నీటి, ఆహార నమూనాలను ఫుడ్ఇన్స్పెక్టర్ సేకరించారు. గురుకులంలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చికిత్స పొందిన విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో నీళ్లు రావడం లేదని, గురుకులంలోని బోరు నీటినే విద్యార్థులు తాగడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు.