హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటివరకు తప్పుడు ప్రసారాలు చేస్తూ, చెత్త రాతలు రాస్తూ, విష ప్రచారం చేస్తున్న తెలంగాణ ద్రోహుల మీడియా ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతిని మళ్లీ అధికారంలోకి వచ్చాక బహిష్కరించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఇందులో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్.. తెలంగాణపై, బీఆర్ఎస్పై, కేసీఆర్‌పై చిమ్ముతున్న విషప్రచారాలను ప్రస్తావించారు.
ఆ లేఖలోని ముఖ్యాంశాలు
‘2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షతో ఉద్యమం పతాకస్థాయికి చేరుకున్నవేళ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ అనేక కుట్రలకు తెరలేపారు. కేసీఆర్ లొంగిపోయారు, అసలు తెలంగాణ రాదు.. వచ్చే అవకాశం లేదనే విషపు రాతలతో 2009 నుంచి 2014 వరకు అనేకమంది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైంది. ఇలాంటి చెత్తరాతలు, రోత ప్రచారంతో అనేక తప్పులు చేసిన ఆంధ్రజ్యోతిని 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న సందర్భంలో వదిలివేసి చాలా పెద్ద తప్పు చేశారు. తెలంగాణపై, కేసీఆర్‌పై రాధాకృష్ణ రాతలు చదువుతుంటే అనేకమంది కార్యకర్తల గుండెలు బద్దలవుతున్నయ్. 2028లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకృష్ణ మీడియాను బహిష్కరించాలి. రాధాకృష్ణ పత్రిక, చానల్ దుర్మార్గాలపై విచారణ చేపట్టాలి. అగ్రనేతలు ఆ చానల్ ఇంటర్వ్యూలకు వెళ్లకూడదు. మీరు మా మనోభావాలకు విరుద్ధంగా వెళ్తే అమరుల ఆత్మలు ఘోషిస్తాయి. అభివృద్ధి ఒక్కటే కాదు, తెలంగాణ అస్థిత్వాన్ని, కేసీఆర్ పేరును కాపాడాల్సిన బాధ్యత మీపై ఉన్నది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణపై అక్కసెందుకు? విషపు రాతలెందుకు?: వాసుదేవరెడ్డి
ఏబీఎన్ చానల్ అధినేత రాధాకృష్ణ తెలంగాణపై అక్కసుతోనే బీఆర్ఎస్పై విషం చిమ్ముతున్నారని దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి విమర్శించారు. ‘తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా?’ అంటూ అడ్డదిడ్డమైన పలుకులెందుకు? అని ప్రశ్నించారు. అవును.. బరాబార్ బీఆర్ఎస్ జాగీరేనని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చి పదేండ్లు అధికారంలో ఉండి నిరంతరం రాష్ట్రాభివృద్ధికి పరితపించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం ఆపకుంటే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు.
రాధాకృష్ణా..మీ రాజకీయ ఎత్తుగడ అర్థమైంది ఇన్‌కంట్యాక్స్ మాజీ అధికారి పీవీఎస్ శర్మ
రాధాకృష్ణ గారూ..ఈరోజు కొత్త పలుకులో మీరు రాసిన ‘తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా’ కథనం చదివిన. దాని వెనుక దాగి ఉన్న రాజకీయ ఎత్తుగడ అర్థమైంది’ అంటూ ఇన్‌కంటాక్స్ మాజీ అధికారి పీవీఎస్ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా ఆయనకు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? 1956 నుంచి తెలంగాణకు అన్యాయం జరిగిందా? లేదా? తెలంగాణ రాకుండా మీ పత్రిక, ఈనాడు అడ్డుకున్నయా? లేదా? బీఆర్ఎస్ తప్ప ఇంకే పార్టీ తెలంగాణ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతిచ్చింది? తెలంగాణ బిల్లు విషయంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలో విబేధాలు ఉన్నాయా..లేవా? ఈ విషయం ఒప్పుకుంటారా? తెలంగాణ వచ్చిందని మీ కడుపులో మంటగా లేదా? ఏదోవిధంగా మళ్లీ తెలంగాణలో ఆంధ్రా పాలకులు అధికారం సంపాదించుకొనేందుకు ఇదో కుట్ర కాదా? ఆ కుట్రలో భాగంగా ఆంధ్రా పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్నారా? లేదా? చెప్పాలి’ అని ప్రశ్నించారు. తన ప్రశ్నలకు రాధాకృష్ణ నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.