Abhaya Gold Infratech | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ) : అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా రూ.800 కోట్ల మోసానికి పాల్పడిందని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సీబీఐ, ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ముతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిందని, ఆ డబ్బుతోనే హైదరాబాద్లోని మాదాపూర్లో కొత్తవెంచర్ ప్రారంభించిందని, అదే డబ్బుతో హైదరాబాద్లో కంట్రీమాల్ను నిర్మించిందని తెలిపారు.
అభయ గోల్డ్ నుంచి వచ్చే డబ్బుతో మల్టీలెవల్ మార్కెటింగ్ వంటి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని సీబీఐకి విన్నవించారు. అభయ గోల్డ్ తెలుగు రాష్ర్టాల్లో రూ.800 కోట్ల వరకు మోసానికి పాల్పడిందని, తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐని కోరారు. అభయగోల్డ్ ఇన్ఫ్రాటెక్కు ఒక రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ ఐపీఎస్ల సహకారం ఉన్నదని, కేసు నమోదు చేస్తే వివరాలన్నీ ఇస్తామని పేర్కొన్నారు.