అలంపూర్ చౌరస్తా, నవంబర్ 24 : హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానలో శనివారం పసికందు కిడ్నాప్ కాగా పోలీసులు రంగంలోకి దిగి ఆరు గంటల్లోనే శిశువును తల్లి ఒడికి చేర్చారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన దంపతులు 45 రోజుల పసికందుకు పసిరికలు రావడంతో శనివారం హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానకు తీసుకొచ్చారు. పథకం ప్రకారం హసిన అనే మహిళ.. ‘నేను దవాఖాన సిబ్బందిని, శిశువుకు వైద్య పరీక్షలు చేయించాలి’ అని తల్లిదండ్రులను నమ్మించి బాలుడిని తీసుకెళ్లింది. ఎంతసేపటికి మహిళ రాకపోవడంతో తల్లిదండ్రులు దవాఖానలో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో నాంపల్లి పోలీసులకు ఫిర్యా దు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి.. కిడ్నాపర్లు కర్నూల్ వైపునకు వెళ్లారని సమాచారం తెలుసుకొని శనివారం రాత్రి జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో హైదరాబాద్, ఉండవెల్లి, మానవపాడు, అలంపూర్ మండలాల పోలీసులు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్గేట్ వద్ద గస్తీ నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేయగా.. ఆదివారం తెల్లవారుజామున 3:30 గం టల ప్రాంతంలో ఓమ్నీ వ్యాన్‌లో బాలుడిని తరలిస్తుండగా పట్టుకున్నారు. వ్యాన్ లో వెంకటేశ్వర్లు, హసీన, రేష్మ అనే మగ్గు రు నిందితులను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిలోఫర్‌లో కిడ్నాప్ అయిన 45 రోజుల పసికందును తల్లిదండ్రులకు అప్పజెప్పినట్టు ఎస్సై మహేశ్ తెలిపారు.