Obesity | హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మహిళలను ఉదర ఊబకాయం వేధిస్తున్నది. రాష్ట్రంలో 35 శాతం నుంచి 50 శాతం మంది మహిళలు ఈ రుగ్మతతో బాధపడుతున్నారు. అంటే 30-49 ఏండ్ల వయస్సున్న ప్రతి 100 మంది మహిళల్లో 35 నుంచి 50 మంది లావుగా ఉండటం కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఉత్తర భారత మహిళలతో పోలిస్తే బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, పక్షవాతం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఎకువగా ప్రభావితమవుతున్నారు.
శారీరక శ్రమలేకపోవడమే ఈ రుగ్మతకు కారణమని ది లాన్సెట్ సర్వే పేర్కొన్నది. దక్షిణ భారతదేశంలోని జనాభాలో అత్యధికంగా 72 శాతం మందికి శారీరక శ్రమ లేకపోవడం ద్వారా ఊబకాయానికి గురై దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల శారీరక శ్రమ కూడా తగ్గుతున్నదని ది లాన్సెట్ (మే 2023) లో ప్రచురితమైన ‘అబ్డామినల్ ఓబెసిటీ ఇన్ ఇండియా: అనాలసిస్ ఆఫ్ ది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5’ అధ్యయనం పేరొన్నది.