హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం అయ్యాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సోమవారం నెట్వర్క్ హాస్పిటళ్ల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్, ప్రధాన కార్యదర్శి హరిప్రకాశ్ వీడియో విడుదల చేశారు. చర్చలు సఫలం అయ్యాయని ప్రకటించారు. ఆర్థిక సంబంధ డిమాండ్లను 4-5 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి ప్రైవేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.