హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి. అదే దారిలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానలు సైతం మంగళవారం అర్ధరాత్రి (11.59) నుంచి ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయనున్నట్టు ప్రకటించాయి. ‘ఆరోగ్యశ్రీ’ కాంగ్రెస్ బ్రాండ్స్కీం అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు సందర్భాల్లో గొప్పగా చెప్పుకున్నా.. నిధుల విడుదల్లో మాత్రం ప్రభుత్వం జాప్యం చేస్తున్నది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానాలకు ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రూ.1,400 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. ప్ర భుత్వం ఆరోగ్యశ్రీ, ఉ ద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్ఎస్) కింద అందిస్తున్న సేవలకుగాను చెల్లింపులు జరపకపోవడంతో దవాఖానల నిర్వహణ భారంగా మారిందని నెట్వర్క్ దవాఖానలు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకున్నాయి.
జనవరిలో రూ.1,100 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ దవాఖానలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయగా.. రెండు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ సీఈవో హామీ ఇవ్వడంతో సేవలను కొనసాగించారు. గ్రీన్చానల్ ద్వారా ప్రతి నెలా ఆరోగ్యశ్రీకి రూ.200 కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. 8 నెలలు గడిచినా.. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగస్టు 31న సేవలు బంద్ చేస్తామని అసోసియేషన్ మరోమారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒకవైపు అసెంబ్లీ జరుగుతుండగానే ఆరోగ్యశాఖ అధికారులు నెట్వర్క్ దవాఖానల అధ్యక్షుడికి ఫోన్ చేసి మరోసారి చర్చలకు రా వాలని ఆహ్వానించారు.
బకాయిల విషయంలో తమకు న్యాయంచేస్తారని నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ భావించగా.. ప్రభుత్వం చర్చల పేరిట రెండు వారాలకుపైగా కాలయాపన చేసింది. చర్చల్లో ఎలాంటి ముందడుగు పడకపోవడంతో ‘ఆరోగ్యశ్రీ’ సేవలను మంగళవారం అర్ధర్రాతి నుంచి బంద్ చేయాలని నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ నిర్ణయించింది. చర్చల సందర్భంగా ఉన్నతాధికారులు ఆర్థిక శాఖ డబ్బులు ఇవ్వకపోతే తామేం చేయాలని ప్రశ్నిస్తున్నారని అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు. ఇంకా అప్పులు తీసుకొచ్చి ‘ఆరోగ్యశ్రీ’ కోసం వెచ్చించలేమని చెప్తున్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపులో కాంగ్రెస్ ప్రభుత్వం సాగదీత ధోరణి కారణంగా ‘ఆరోగ్యశ్రీ’ సేవలు నిలిచిపోతే ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని వైద్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ‘ఆరోగ్యశ్రీ’ సేవలను మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలిపివేయనున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్డిరాజు రాకేశ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత 20 రోజులుగా ఆరోగ్యశాఖ మంత్రి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోతో చర్చలు జరుపుతున్న ట్టు తెలిపారు. తమ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ నెట్వర్క్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. సేవల నిలిపివేత కారణంగా ప్రజలకు కలిగే అసౌక్యరానికి చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.