ఖైరతాబాద్, అక్టోబర్ 28: మీరిచ్చే ఇండ్లు వద్దు.. రెండు లక్షలూ వద్దని పలువురు మూసీ పరీవాహక ప్రాంత వాసులు స్పష్టం చేశారు. మూసీ బాధితుల హక్కుల పరిరక్షణ ఫోరం, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆప్ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్, ఫోరం చైర్మన్ అఫ్సాన్ సలాం, మూసీ పరీవాహక ప్రాంత బాధితులతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టించడం మానేసి, కూల్చివేసి వారిని రోడ్డున పడేయడమేంటని ప్రశ్నించారు. పేదలకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాకే ఇండ్లను కూల్చివేయాలని కోరారు. ఎందరో బడాబాబులు నాలాలు, చెరువులను ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకుంటే ప్రభుత్వానికి కనబడడం లేదని మండిపడ్డారు. కష్టం చేసుకొని జీవిస్తున్న పేదల ఇండ్లను మూసీ సుందరీకరణ పేరిట కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణపై తక్షణమే డీపీఆర్ రిపోర్టును విడుదల చేయాలని, బాధితులందరికీ నష్టపరిహారం, పునరావాసం, పక్కా భవనం నిర్మించిన తర్వాతే కూల్చివేతలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలా కాదని పేదలను రోడ్డుపై పడేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు మూసీ పరీవాహక ప్రాంత వాసులు తమ గోడును ‘నమస్తే’తో పంచుకున్నారు.
కబ్జా కాదు.. పక్కా పట్టాభూమి
నా భర్త క్యాబ్ డ్రైవర్. పైసా పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకున్నం. మేమేదో కబ్జా చేసిన ఇల్లు అన్నట్టుగా అధికారులు ప్రవర్తిస్తున్నరు. ఇది పక్కా పట్టా భూమి. ఏటా అన్ని పన్నులు కడుతున్నం. బఫర్‌జోన్‌లో ఉంటే, ఇన్నేళ్లు ప్రభుత్వం మా దగ్గర పన్నులెందుకు తీసుకున్నది. నోటీసులు కూడా ఇవ్వకుండా మార్కింగ్ చేసిన్రు. ఏ టైములో బుల్డోజర్ వచ్చి మా బతుకులను ఆగం చేస్తదో అని కంటి మీద నిద్ర కూడా కరువైంది. రెండు లక్షలు వద్దు.. మా ఇండ్లు మాకు ఉంటే చాలు. ఆరు గ్యారెంటీలని చెప్పి అరిగోస పెడుతున్నరు.
-పద్మ, కేటీఆర్‌నగర్, రామంతాపూర్
డబుల్ బెడ్రూం సరిపోదు..
ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తమని చెప్పి, ఉన్న ఇంటిని కూల్చివేస్తున్నరు. 70 గజాల స్థలంలో కష్టపడి ఇల్లు కట్టుకున్నం. మాకు నీడ లేకుండా చేస్తున్నరు. మా ఇల్లు కూల్చకుండానే అభివృద్ధి చేయలేరా? పేదలకు మంచి చేసుడు పక్కనబెట్టి, ఉన్న ఇంటిని కూడా లేకుండా చేస్తున్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన ఇండ్లలోకి పొమ్మంటున్నరు. మాది పెద్ద కుటుంబం. అది మాకు సరిపోదు. మంచి చేయకున్నా సరేగాని ఇట్ల చెడు చేసుడు ఎందుకు?
-నీల, కేటీఆర్‌నగర్, రామంతాపూర్
ఇద్దరు పిల్లలతో ఏడికి పోవాలె..
నా భర్త సెంట్రింగ్ కార్మికుడు. మాకు ఇద్దరు పిల్లలు. వచ్చే డబ్బులు మా కుటుంబ పోషణకే సరిపోవడం లేదు. ఉన్న ఒక్క ఇంటిని కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటానంటున్నది. పేదోళ్లు రోడ్డు మీద పడుడే అభివృద్ధా? డబుల్ బెడ్రూం ఎక్కడిస్తరో చెప్పడం లేదు. నోటీసులు ఇవ్వకుండానే మార్కింగ్ చేసి వెళ్లిండ్రు. ఖాళీ చేయమని బెదిరిస్తున్నరు. ఇద్దరు పిల్లలతో ఏడికి పోవాలె. ఎట్ల బతకాలె. ఈ ప్రభుత్వం ఇట్ల చేస్తదని అనుకోలే.
-వీ. భాగ్యలక్ష్మి
పేదల ఇండ్లే కావాల్నా?
ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే ఉం టున్నం. ఈ ఇంట్లోనే మూడుతరాలుగా ఉంటున్నది. కష్టపడి కట్టుకున్న ఇంటిని వదిలి డబుల్ బెడ్రూంలోకి పొమ్మంటున్నరు. ప్రభుత్వం మంచి ఇల్లు ఇచ్చి అప్పుడు కూల్చివేయాలి. మాది పెద్ద కుటుంబం. ఆ డబుల్ బెడ్రూంలో కొడుకులు, కోడళ్లు, మనుమండ్లు, మనమరాండ్లతో ఎలా ఉండాలె. ఈ సర్కారుకు పేదలకు ఇండ్లు కట్టడం చేతగాదని అర్థమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లనే పంచి, మేం ఇస్తున్నమని చెప్పుకుంటున్నది.
-అనురాధ, కేటీఆర్ కాలనీ, రామంతాపూర్
ఏడికి పోవాల్నో.. ఏం చేయాల్నో..
నా భర్తకు రెండు కిడ్నీలు ఖరాబైనయ్. గుండె సమస్య కూడా ఉంది. పూర్తిగా మంచం పట్టిండు. మాకు ఒక పాప, బాబు. ఎల్బీనగర్లో ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న. నెలకు వచ్చే రూ.10వేలతోనే నా ఇల్లు గడుస్తున్నది. ఇప్పుడు నీడగా ఉన్న ఈ ఒక్క ఇంటిని కూడా కూల్చివేస్తమంటున్నరు. గిట్లయితే ఎట్ల బతకాలె. ఏం చేయాలె. మా ఇంటికి మార్కింగ్ చేసినప్పటి నుంచి పెద్ద రంది పట్టుకున్నది.
-ఈ. జయ, కేటీఆర్‌నగర్, రామంతాపూర్