ఎల్లారెడ్డిపేట, జనవరి 13 : ఎరువుల కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు మళ్లీ పునరావృతమవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారంలోని గ్రామ పంచాయతీలో ఒక రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇవ్వాలని నిబంధన పెట్టడంతో రైతులు సోమవారం ఉదయమే వచ్చి ఎరువుల బస్తాల కోసం క్యూలైన్లో నిలబడ్డారు. కొద్దిసేపటికి ఆధార్ కార్డులు కావాలని గ్రామ పంచాయతీ సిబ్బంది అడగడంతో వాటిని వరుసలో పెట్టి టోకెన్లు తీసుకున్నారు. 350 ఇండ్లు, 600 ఎకరాలు 163 మంది రైతులున్న ఈ చిన్న గ్రామంలో గత పదేండ్లలో ఎప్పుడూ ఎరువుల కోసం క్యూలైన్లు కట్టలేదని, ఇప్పుడు మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు గుర్తుకు వస్తున్నాయని రైతులు వాపోయారు. బీఆర్ఎస్ హయాంలో లేని ఇబ్బందులు ఇప్పుడెందుకని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.
పంట పొలాల్లో పిండి వంటలతో నిరసన
కాశీబుగ్గ, జనవరి 13 : వరంగల్ నగరంలోని 3వ డివిజన్ ఆరెపల్లిలో ఇన్నర్ రింగ్ రోడ్డులో వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో కాంగ్రెస్ నేతల వైఖరిని వ్యతిరేకిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి పంట పొల్లాల్లోనే పిండి వంటలు చేశారు. ఆరెపల్లి శివారు ఎన్ఎస్ఆర్ దవాఖాన నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) నిర్మాణానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) శ్రీకారం చుట్టింది. అధికార పార్టీలో పలుకుబడి ఉన్న నేతలు తమ భూముల విలువ పెరిగేలా తమకు అనుకూలంగా ఐఆర్ఆర్ అలైన్మెంట్ను మార్చేందుకు కీలకంగా వ్యవహరించారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో తమకు జీవనాధారంగా ఉన్న పంట భూములను కోల్పోతున్నామని కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అధికారులు నేతల ఒత్తిళ్లతో అశాస్త్రీయంగా ఉన్న కొత్త అలైన్మెంట్ వైపు మొగ్గు చూపుతుండడంతో పలు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నట్టు రైతులు పేర్కొంటున్నారు. కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మెల్యే, జిల్లా ఇన్చార్జి మంత్రిని కలిసి వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలైన్మెంట్ మార్చొద్దని, పాత దానినే కొనసాగించాలంటూ పంట పొలాల్లో పిండి వంటలు చేస్తూ నిరసన తెలిపారు. ఇప్పటికైనా తమ భూములను ఐఆర్ఆర్ బారి నుంచి కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.