హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానలో వైద్యం చేయాలంటే రోగికి విధిగా ఆధార్‌కార్డు ఉండాలా? లేకపోతే వైద్యం అందించరా? దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోగి వెంట సహాయకుడు లేకపోతే వైద్యం చేసేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయో లేదో కూడా చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వ విధానంపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని గురువారం మరోసారి ఆదేశించింది.
మహబూబాబాద్ జిల్లా, చిన్నగూడూరు మండలం, జయ్యారం గ్రామానికి చెందిన రవి.. కిడ్నీ చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వెళ్లగా, అతని వెంట సహాయకుడు లేడని, ఆధార్‌కార్డు లేదని చెప్పి వైద్యం అందించేందుకు సిబ్బంది నిరాకరించడతో అతడు దవాఖాన క్యాంటీన్ పరిసరాల్లో ఉంటూ స్పృహ తప్పి పడిపోయారు. సుమోటోగా స్పీకరించాలని హైకోర్టు న్యాయమూర్తుల బృందం చేపట్టాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారించి, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
రోగి వద్ద ఆధార్‌కార్డు లేకపోయినప్పటికీ ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు అందజేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.