Telangana | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో ఒక నిరుద్యోగ యువతి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాళ్ల మీద పడినతీరు నిరుద్యోగ యువతను కదిలించింది. రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారిని 1:50 నిష్పత్తిలో కాకుండా, 1:100 చొప్పున మెయిన్ పరీక్షలకు ఎంపిక చేయాలని పరీక్షార్థులు కోరుతున్నారు. ఇదే అంశంపై శుక్రవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో చిన్నారెడ్డిని పలువురు నిరుద్యోగులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సమయంలో ఒక చిన్నారెడ్డి కాళ్ల మీద పడింది. మెయిన్ పరీక్షలకు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రూప్-2లో రెండు వేలు, గ్రూప్-3లో మూడు వేల చొప్పున పోస్టులు పెంచాలని ప్రాధేయపడింది. అయినప్పటికీ, చిన్నారెడ్డి నుంచి వారికి ఎలాంటి హామీ లభించలేదు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి నిరుద్యోగులతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్ పరీక్షలు రాసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు ఉద్యోగాలు రావా? రాకపోతే మరో నోటిఫికేషన్ వస్తుంది. దానికి ప్రిపేర్ అవండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. రా్రష్ట్రంలో వచ్చే నాలుగేండ్లలో 30 లక్షల మందికి స్కిల్స్ నేర్పించి, మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు.
అంతేతప్ప నిరుద్యోగుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించలేదు. దీంతో నిరుద్యోగులు ఒక్కసారిగా హతశులయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు మాట్లాడుతున్నదేమిటి? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సీఎల్పీ నేతగా వ్యవహరించిన ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం గ్రూప్-1 మెయిన్‌కు 1:100 నిష్పత్తిలో అవకాశం కల్పించాలని అసెంబ్లీలో కోరారని నిరుద్యోగులు గుర్తుచేస్తున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చేసిన డిమాండ్‌ను నేడు అధికారంలో ఉండి కూడా నెరవేర్చకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా 503 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. నాడు భారీ నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నో ఆశలతో లక్షలాది నిరుద్యోగులు పరీక్షలకు హాజరయ్యారు. గ్రూప్-1 పరీక్ష పేపర్ లీక్ అవ్వడం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ నోటిఫికేషన్‌నే రద్దు చేశారు. గ్రూప్-1 పరీక్షల కోచింగ్‌ల కోసం ఎంతో ఖర్చు చేసిన చాలామంది అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహణ ఆర్థికంగా భారంగా పరిణమించింది. కొంతమందికి ఉద్యోగార్హత వయసు కూడా దాటిపోతున్నది. సుదీర్ఘకాలం నిరీక్షించలేక కొందరు ఏదో ఒక పనిలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలకు అభ్యర్థులు సరిగా ప్రిపేర్ కాలేకపోయారు. కొందరు నిరుద్యోగులు కాం గ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, ఇన్ సర్వీస్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి, ఓటర్ల కాళ్లు పట్టుకుని మరీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రచారం చేశామని నిరుద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రా్రష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కనీసం సమీక్ష కూడా జరగడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతూనే ఉన్నది. మొన్న స్టాఫ్‌నర్సులు, ఏఈఈ అభ్యర్థులు ఆందోళన చేయగా, తాజాగా శుక్రవారం గురుకులాల్లో డీఎల్, జేఏల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ధర్నాకు దిగారు. తమకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని, పోస్టింగ్ ఇవ్వలేదంటూ ధర్నా నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తేసినప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వడం లేదని వాపోయారు. గురుకుల అధికారులను సంప్రదిస్తే..ప్రభుత్వం అనుమతులు ఇస్తేనే పోస్టింగ్స్ ఇస్తామని చెప్తున్నారని అభ్యర్థులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డిప్యూటీ సీఎం నివాస ప్రాంగణం ప్రజాభవన్‌లో శుక్రవారం జరిగిన ప్రజావాణిలో ఒక యువతి కాంగ్రెస్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాళ్లమీద పడినతీరు నిరుద్యోగులను కదిలించింది. గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగానే గ్రూప్-2లో రెండు వేలు, గ్రూప్-3లో మూడు వేల చొప్పున పోస్టులు పెంచాలని ఆమె ప్రాధేయపడింది. అర్హత సాధించినవారిని గ్రూప్-1 మెయిన్‌కు 1:100 చొప్పున ఎంపిక చేయాలని కోరింది.