బోథ్, నవంబర్ 5 : నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలోని ఏఎన్‌రెడ్డి కాలనీలో గల గ్రిల్ నైన్ మల్టీ కుజైన్ రెస్టారెంట్లో భోజనం(Biryani) చేసి అస్వస్థతకు గురైన యువతి ఫూల్ ఖలీ బైగా(19) మృతి చెందింది. వివరాలిలాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర క్రాస్ రోడ్డులో గల సెయింట్ థామస్ స్కూల్లో పని చేస్తున్న ప్రిన్సిపల్ సిస్టర్ స్మిత, ఫాదర్ దీపక్, వైఎస్ ప్రిన్సిపల్ సోఫీ, ఉపాధ్యాయురాలు సిజి, వంట మనిషి ఫూల్ ఖలీ బైగాలు ఈనెల 2వ తేదీన నిర్మల్‌కు షాపింగ్‌కు వెళ్లారు.
సాయంత్రం కావడంతో గ్రిల్ నైన్ మల్టీ కుజైన్ రెస్టారెంట్లో చికెన్ సిక్ట్సిఫై, తందూరి చికెన్, చికెన్ ఫ్రైడ్ రైస్‌లు తిన్నారు.
ఇంటికి రావడంతో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల యాజమాన్యం 3వ తేదీన బోథ్‌లోని సీహెచ్‌సీలో చేర్పించారు. వాంతులు, విరేచనాలు కావడంతో చికిత్స అనంతరం వీరిని ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఈనెల 5వ తేదీన మరోసారి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఫూల్ ఖలీ బైగా మంగళవారం మృతి చెందింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో కామారెడ్డికి తరలించారు. కాగా, గ్రిల్ నైన్ మల్టీ కుజైన్ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాఠశాల యజమాన్యం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.