జఫర్ఘడ్ : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మొంథా తుపాన్ ప్రభావంతో జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద దాటికి( Floodwater) బైక్‌పై వెళ్తున్న యువతీ, యువకుడు కొట్టుకుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన బరిగల శివకుమార్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెదిన యువతి శ్రావ్య ఇద్దరు కలిసి బైక్ వస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్ నుంచి జఫర్ఘడ్ వెళ్లే ప్రధాన రహదారిపై తిమ్మంపేట గొల్ల మత్తడి వద్ద రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరదను లెక్క చేయకుండా దాటే ప్రయత్నం చేయగా బైక్‌తో సహా ఇద్దరు కొట్టుకుపోయారు.
శివకుమార్ చెట్టు కొమ్మను పట్టుకొని సురక్షితంగా బయటపడ్డాడు. యువతి మాత్రం గల్లంతయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు గొల్ల ముత్తడి వద్దకు చేరుకుని 30 మంది ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో గాలిస్తున్నారు. కాగా, యువతి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తూ అమ్మాయిని ప్రైవేట్ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో శ్రావ్య చదువుతున్నట్లు సమాచారం. బోళ్ల మత్తడి వద్ద డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీవో వెంకన్న, ఏసీపీ నరసయ్య సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
