Etela Rajender | కమలాపూర్, నవంబర్ 20: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోసం హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పనిచేస్తే కేసులు అయ్యాయని, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఊడిందని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేండ్లుగా కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఈటల పట్టించుకోవటం లేదని నిట్టూర్చాడు. ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నా కనీసం కనికరించటం లేదని తెలిపాడు.
ఎన్నికల ప్రచారం కోసం తన గ్రామంలో ఈటల ప్రసంగిస్తుండగా అడ్డుకోవటంతో ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని చందబోయిన సాయిప్రసన్న అనే యువకుడు వెల్లడించాడు. బాధితుడి కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపెల్లిగూడేనికి చెందిన చందబోయిన సాయిప్రసన్న రెండేండ్ల క్రితం ఏబీవీపీ కరీంనగర్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లో పనిచేశాడు.
హుజూరాబాద్ ఉపఎన్నికలు రావడంతో కరీంనగర్లో ఉన్న సాయిప్రసన్నకు ఈటల ఫోన్ చేసి ఎన్నికల్లో పనిచేయాలని కోరారు. దాంతో ఈటల గెలుపు కోసం అతడితో పాటు పది మంది స్నేహితులు పనిచేశారు. ఎన్నికల సమయంలో తెల్లవారితే ఓటింగ్ ఉండటంతో పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తుల పేర్లు రాసుకుని పంపించారు. రెండు రోజులకు కేసులు నమోదైనట్టు నోటీసులు జారీ చేశారు.
ఎన్నికలు ముగిశాక ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు. అయితే, క్రిమినల్ కేసులు నమోదు కావటంతో ఆ కంపెనీ ఉద్యోగంలోంచి తొలగించింది. ఉద్యోగం కోసం, కేసులపై రెండేండ్లుగా శామీర్‌పేటలోని ఈటల ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని సాయిప్రసన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యోగం కోల్పోయి రోడ్డునపడ్డానని, తనను ఆదుకోవాలని ఈటలను అడిగితే.. ఎవరికోసం పనిచేసినవ్ అని అన్నారని కన్నీటి పర్యంతమయ్యాడు.
‘అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19న మర్రిపెల్లిగూడేనికి వచ్చిన ఈటల ప్రచార రథంపైకి ఎక్కాను. ఉద్యమ సమయంలో కేసులు నమోదైనా భయపడకుండా ప్రజల కోసం పనిచేశానని ఈటల అన్నారు. దీంతో ఉద్యోగం కోల్పోయిన నాకు ఇప్పించలేదని అడిగా. కేసులు నమోదైనా పట్టించుకోవటం లేదని నిలదీశా. వెంటనే ఈటల అనుచరులు ప్రచార రథం నుంచి కిందకు లాగి చంపేస్తామంటూ పిడిగుద్దులు గుద్దారు. ఆ మరుసటి రోజు నుంచి నేను ఎటువెళ్తే అటు గుంపులు గుంపులుగా వెంబడిస్తున్నారు. ఈటల అనుచరులతో నాకు ప్రాణభయం ఉంది’ అని ఆరోపించాడు.