తాడ్వాయి, సెప్టెంబర్7 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్నవాగులోకి ఈతకు వెళ్లి కానుగంటి మనీశ్ (23) అనే యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు, మృతుడి స్నేహితుల కథనం ప్రకారం.. జనగామ జిల్లాకు చెందిన మనీశ్ తన స్నేహితులతో కలిసి మేడారం సమ్మక్క,సారలమ్మ దర్శనానికి వచ్చారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్నేహితులతో కలిసి జంపన్నవాగులో ఈతకు వెళ్లారు.
అందరూ వాగులోకి దిగగా మనీశ్ లోతు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లి అందులో మునిగి గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు మనీశ్ కోసం గాలించగా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు, ఆర్డీఎఫ్ బృందానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఆర్డీఎఫ్ బృందం మనీశ్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసింది. మనీష్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.