మెదక్ : ఆన్లైన్ బెట్టింగ్లో(Online betting) మోసపోయి ఓ యువకుడు ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్(Medak) జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన దొమ్మాట భాను ప్రసాద్(24) అనే యువకుడు గత కొన్ని రోజులుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కాలం గడుపు తున్నాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో బెట్టింగులు పెడుతూ లక్షా యాభై వేల రూపాయలు పోగుట్టుకున్నాడు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఐదురోజుల క్రితం తన వ్యవసాయ బావివద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానకు తరలించారు. భాను ప్రసాద్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.