రామాయంపేట, జనవరి 12 : ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా డబ్బులు కోల్పోయి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని శామీర్పేట చౌరస్తా వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్కు చెందిన చాకలి ప్రశాంత్ (25) మేడ్చల్ జిల్లా శామీర్పేట సర్కిల్లోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఇంటికి డబ్బులు పంపించకుండా పెట్రోల్ బంకులోనే ఉంటూ ఆన్లైన్ బెట్టింగ్ కడుతున్నాడు. బెట్టింగ్లో సుమారు రూ.7.50 లక్షలు కోల్పోయాడు. పనిచేస్తున్న బంకులో మరో రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. మొత్తం అప్పు రూ.9 లక్షలకు చేరుకున్నది. వీటిని తీర్చే మార్గం లేక ఆందోళనకు గురైన ప్రశాంత్ శామీర్పేటలోనే రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
17.79 లక్షలు చోరీ కామారెడ్డి జిల్లా పిట్లంలో ఘటన
పెద్దకొడప్గల్, జనవరి 12: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేం ద్రంలోని ఏటీఎం నుంచి దుండగులు రూ.17.79 లక్షలను ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. పిట్లం మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా పెద్దకొడప్గల్- బిచ్కుందకు వెళ్లే మార్గంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి శనివారం రాత్రి 3 గంటల ప్రాంతంలో ముసుగుతో వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసి రూ.17.79 లక్షలను ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ చైతన్యారెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాజేశ్వర్ ఆదివారం పరిశీలించారు. ఏటీ ఎం సూపర్వైజర్ రాచర్ల ప్రవీణ్ కు మార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాజు తెలిపారు.