హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు అరుదైన ఘటన ఎదురైంది. గురువారం సాయంత్రం విమానాశ్రయంలో దిగిన కేటీఆర్ దగ్గరకు హైదరాబాద్‌కు చెందిన వినీల పరుగున వచ్చింది. కేటీఆర్‌తో ఒక ఫొటో దిగింది. అప్పటికప్పుడు తన దగ్గర ఉన్న న్యాప్కిన్పై కేటీఆర్ నాయకత్వ లక్షణాలు ప్రశంసిస్తూ లేఖ రాసి ఆయనకు అందించారు.
‘మీరు ఎంత ఆదర్శంగా ఉంటారో మీతో కొద్దిసేపు మాట్లాడితే తెలుస్తుంది. మీరు ఆధునిక, ఉన్నత వ్యక్తిత్వ భావాలు కలిగినవారు. మిమ్మల్ని ఎప్పటినుంచో గమనిస్తున్నాం. వినయపూర్వకంగా, హంబుల్‌గా, సింపుల్‌గా ఉంటారు. మీలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కావాలని చాలాసార్లు అనుకున్నా. మీరు విజనరీ పొలిటీషియన్. మీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో అనేక ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. విదేశీ సంస్థలను హైదరాబాద్‌కు రప్పించారు. విదేశీ పెట్టుబడులు పెట్టించారు
మహిళాహబ్స్ స్థాపించారు. స్టార్టప్స్ కల్చర్‌ను తీసుకొచ్చారు. పట్టణాభివృద్ధిని పరుగులు పెట్టించారు. ట్విట్టర్లో లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. ఇంకా అనేక అంశాల్లో స్ఫూర్తిగా నిలిచారు. మా జనరేషన్లో మీరు లీడర్‌గా ఉన్నందుకు గర్వంగా ఉన్నది. ధన్యవాదాలు. అమెరికాకు సులువైన బాటలుపర్చిన మీ పాలనకు కృతజ్ఞతలు. మాకు తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టినందుకు జేజేలు. తెలంగాణ బిడ్డలుగా, హైదరాబాదీలుగా మేము గర్వపడుతున్నాం’ అని లేఖలో వినీల శ్లాఘించారు. ఆ లేఖను ఎక్స్‌లో పోస్టుచేసిన కేటీఆర్.. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించారు.