వీర్నపల్లి, మార్చి 23: ఇందిరమ్మ ఇల్లు మధ్యలోనే ఆగిపోవడంతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన గుగులోత్ గోపాల్ (40) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో ఉపాధి నిమిత్తందుబాయ్ వెళ్లాడు. అక్కడా ఆశించిన స్థాయిలో జీతం రాకపోవడంతో ఇటీవల స్వగ్రామానికి చేరుకున్నాడు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి పనులు మొదలుపెట్టాడు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక, చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో ఆ ఇంటి నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అప్పుల ఒత్తిడి పెరిగిపోవడంతో శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పెద్ద దిక్కు మరణించడంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. మృతుడికి భార్య నిర్మల, కూతుర్లు సరస్వతి, శిరీష, కుమారుడు జగ్గు ఉన్నారు. గోపాల్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.