హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఓ యువ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు. వివిధ టాస్క్‌ల పేరుతో వాళ్లు చెప్పినట్టు చేసి రూ. 8.82 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా తగరపువలసకు చెందిన వ్యక్తి వాట్సాప్ నెంబర్‌కు ఓ మెసేజ్ వచ్చింది. పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించొచ్చని అతడిని సైబర్ నేరగాళ్లు నమ్మించి, ఖాతాలో రూ.100 జమ చేశారు.
అనంతరం వివిధ టాస్క్‌లు ఇచ్చి.. మాటల్లో పెట్టి రూ.8.82 లక్షల వరకు కొల్లగొట్టారు. మరికొన్ని డబ్బులు పంపిస్తే.. టాస్క్ పూర్తవుతుందని మళ్లీ మెసేజ్ పెట్టడంతో బాధితుడు తాను మోసపోయినట్టు గ్రహించాడు. శుక్రవారం అతడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.