హైదరాబాద్/శ్రీశైలం, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ప్రపంచబ్యాంకు ప్రతినిధిబృందం మంగళవారం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించింది. ప్రపంచబ్యాంకు ప్రతినిధి హాండా నేతృత్వంలో 10 మందితో కూడిన బృందం సోమవారం రాత్రి సున్నిపెంట ఏపీజెన్కో గెస్ట్‌హౌస్‌కు చేరుకుంది. మంగళవారం జలాశయ అధికారులతో కలిసి డ్యాం గేట్లు, గ్యాలరీ, డ్యామ్ ముందుభాగంలో ఏర్పడిన ప్లంజ్‌పూల్‌ను సీడబ్ల్యూసీ అధికారులు అతుల్ యాప, అఖిలేశ్కుమార్తో కలిసి పరిశీలించింది.
2009 వరద ప్రభావంతో దెబ్బతిన్న కుడిగట్టు కొండచరియలు, రహదారుల పునరుద్ధరణను బలోపేతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఇరిగేషన్ అధికారులు వివరించారు. డ్యాం మరమ్మతులకు రూ.700-800 కోట్లు అవుతుందని అంచనా వేసిన అధికారులు మొదటి విడతలో భాగంగా రూ. 139 కోట్ల కోసం ప్రపంచబ్యాంకు నుంచి నిధులు కోరారు.
ఈ నేపథ్యంలోనే ప్రపంచబ్యాంకు డ్యాం సందర్శనకు వచ్చింది. ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ప్రపంచబ్యాంకు బృందం మరమ్మత్తుల కోసం జలాశయ అధికారులు పంపించిన అంచనాలతో ఏకీభవించింది. ఇంకేమైనా చిన్నచిన్న మరమ్మతులకు సంబంధించి అంచనాలు పంపిస్తే వాటిని కూడా పరిశీలించి నిధుల విడుదలకు అనుమతినిస్తామని పేర్కొంది. పరిశీలన అనంతరం శ్రీశైలం డ్యాం డ్రిప్ ప్రాజెక్టు నిధుల వినియోగంపై యూ పాయింట్ వద్ద అధికారులతో ప్రపంచబ్యాంకు బృందం సమావేశమైంది. మరమ్మతులకు అయ్యే వ్యయంలో 70 శాతం ప్రపంచబ్యాంకు సమకూరుస్తుందని, మిగిలిన 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా గతంలో జరిగిన ఒప్పందంపై ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు ఇరిగేషన్ అధికారులు వివరించారు.