రఘునాథపాలెం, ఫిబ్రవరి 21 : తాను మరణించి.. ముగ్గురికి ప్రాణం పోసింది.. ఖమ్మం నగర పరిధిలోని టేకులపల్లికి చెందిన గోరంకల ప్రమీల (44) ఈ నెల 16న భర్తతో కలిసి బైక్పై ముదిగొండ మండలంలోని ఓ ఫంక్షన్హాల్లో బంధువుల శుభకార్యానికి వెళ్లారు. తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా ఖమ్మం నగర పరిధిలోని మమత రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమీల బైక్పై నుంచి క్రింద పడిపోయింది. ఆ సమయంలో కోమాలోకి వెళ్లిన ప్రమీలను కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించారు. అప్పటి నుంచి దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రమీల బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యుల సూచనల మేరకు ప్రమీల అవయవాలను వైద్యులు ముగ్గురికి దానం చేశారు. తన భార్య చనిపోయినా ఇతరుల రూపంలో బతికుండాలనే భర్త ఆలోచన ముగ్గురికి ప్రాణం పోసింది.