విద్యానగర్, జూన్ 13: కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానలో ఓ మహిళ సాధారణ ప్రసవంలో 4 కిలోల బరువు ఉన్న మగ శిశువుకు జన్మనిచ్చింది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మ లాపూర్ గ్రామానికి చెందిన కోరేపు మౌనిక పురిటి నొప్పులతో ఆదివారం రాత్రి కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో చేరింది. వైద్యులు మౌనికను పరీక్షించి సాధారణ ప్రసవం అవుతుందని సూచించారు.
సోమవారం రాత్రి సాధారణ ప్రసవంలో 4 కిలోల బరువుతో మగ శిశువు జన్మించాడు. సాధారణ ప్రసవంలో రెండున్నర కిలోల నుంచి మూడున్నర కిలోల వరకు శిశువులు జన్మిస్తారని, కానీ.. ఇది 4 కిలోలతో జన్మించడం చాలా అరుదైన ఘటన అని వైద్యులు పేరొన్నారు. తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నారని దవాఖాన సూపరింటెండెంట్ కృష్ణప్రసాద్, ఆర్ఎంవో డాక్టర్ జ్యోతి తెలిపారు.