ఐనవోలు, నవంబర్ 9: రూ.లక్షా నూటపదహార్ల చెక్కు ఇచ్చారు సరే.. తులం బంగారం ఏది సారూ అంటూ ఓ మహిళ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ప్రశ్నించారు. శనివారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి శివారులో నందనం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టెస్కాబ్ చైర్మన్ రవీందర్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా గర్మిళ్లపల్లికి చెందిన కొండ రేణుకకు కల్యాణలక్ష్మి కింద మంజూరైన రూ.లక్షా నూటపదహార్ల చెక్కును అందజేశారు. చెక్కు తీసుకున్న ఆమె.. ‘లక్షానూటపదహార్ల చెక్కు ఇస్తున్నావు సరే కానీ.. తులం బంగారం ఏది సారూ’ అంటూ శ్రీహరిని అడిగింది. దీంతో ఇంత సేపు అదే చెప్పితిని కదా.. నెమ్మదిగా ఒక్కొక్కటి ఇస్తామంటూ నవ్వుకుంటూ కడియం సమాధానం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని, సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డిపై విశ్వాసం ఉంచాలని కోరారు.