Mahabubabad | కేసముద్రం, అక్టోబర్ 13: భర్తను కడతేర్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండలో ఆదివారం చోటుచేసుకున్నది. గూడూరు సీఐ బాబురావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన లక్క ప్రశాంత్ (30)కు, కడప జిల్లా పులివెందులకు చెందిన అమీనాకు కొన్నేళ్ల క్రితం రెండో వివాహం జరగ్గా, మొదటి సంబంధానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు పెనుగొండలో ఉంటుండగా, అమీనా తల్లి నూర్జహాన్, సోదరుడు అమీర్‌పాషా అదే ఊర్లో వేరే ఇంట్లో ఉంటున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలు తనకు పుట్టలేదని అమీనాను ప్రశాంత్ మద్యం తాగి వచ్చి రోజూ ఇబ్బంది పెడుతుండేవాడు.
ప్రశాంత్‌ను హత్య చేయాలని భావించి, తల్లి, సోదరుడి సాయం కోరింది. ఈ నెల 10న తెల్లవారుజామున అమీనాతోపాటు ఆమె తల్లి నూర్జహాన్, సోదరుడు అమీర్‌పాషా కలిసి నిద్రపోతున్న ప్రశాంత్ మెడకు తాడు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని రైల్వే ట్రాక్ మీద పడేసి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించాలనుకున్నారు. హాస్పిటల్‌కు అని చెప్పి ప్రశాంత్ మృతదేహాన్ని మహబూబాబాబ్లోని రైల్వే గేట్ వైపు తీసుకుపోవాలని ఆటో డ్రైవర్ రాముకు సూచించారు. అనుమానం వచ్చిన రాము 100 నంబర్‌కు డయల్చేశాడు. అమీనా, నూర్జహాన్, అమీర్పాషాపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ, ఎస్సై తెలిపారు.