హిమాయత్‌నగర్, మార్చి 26 : ‘దళితుల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, దళితుల సంక్షేమం కోసం ఏం చేసిందో చెప్పాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దళితుల సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మాజీ సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా దళిత బంధు నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు.
‘ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో దళితబంధు కోసం కేటాయించిన రూ.1,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి. అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించి చట్టబద్ధత కల్పించాలి. చేవెళ్ల డిక్లరేషన్ అమలుతోపాటు పెండింగ్ దళితబంధు నిధులను తక్షణమే విడుదల చేయాలి. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండి దళితుల అభ్యున్నతికి నిధులు సాధించలేని అసమర్థులని, వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బడ్జెట్‌ను సవరింపజేసి అధిక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. త్వరలోనే చేవెళ్లలో దళితుల ఆత్మగౌరవ సభ ఏర్పాటుచేసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగడతామని హెచ్చరించారు. సమావేశంలో సమితి రాష్ట్ర నేతలు దర్శనాల సంజీవ, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, ఆదిమళ్ల లింగయ్య, మర్రి రేణుక, రాజబాబు, మొగిలి, మధుకర్ పాల్గొన్నారు.