మహబూబ్ నగర్ : ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 24న నిర్వహిస్తున్న ఆటోల బంద్ ( Auto Bandh ) ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆటో బంద్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల వెన్నముకను కాంగ్రెస్ ప్రభుత్వం విరగొట్టిందని ఆరోపించారు.
ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు సంతోషంగా లేరని వెల్లడించారు. భార్యకు ఉచితమని చెప్పి భర్త టికెట్ ధర పెంచారని విమర్శించారు. ప్రభుత్వం కొత్త బస్సులు ఇవ్వకుండా పాత బస్సులు మాత్రమే నడుపుతున్నారని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆటో కార్మికులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పడుతున్నాని తెలిపారు.
ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, రూ. 12 వేల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆటోల ఈఏంఐలు కట్టలేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు పోరాటం చేయాలని ఆటో కార్మికులకు సూచించారు.