మీకు తెలుసా? భక్తికి కూడా ఆస్తి పరిమితులు ఉంటాయట. దేవుళ్లలో ధనికులు, పేదలు ఉంటారట. ఇకపై మీరు పూజించే దేవుడిని బట్టి మీ ఆదాయ వర్గీకరణ ఈజీగా
చేయవచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లకు ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ ఇవ్వడం చాలా తేలికైపోతుంది. మీరు రాముడిని పూజించారనుకోండి.. మీరు డబ్బున్నోళ్ల కింద లెక్క.
శివుడిని పూజించారనుకోండి.. అటోమేటిక్‌గా ఈడబ్ల్యూఎస్ కోటాలోకి వచ్చేస్తారన్నమాట. ఈ మాట అంటున్నది ఎవరో కాదు… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. రాముడు డబ్బున్నోళ్ల దేవుడంట. శివుడు పేదల దేవుడంట. రాముడు ఉత్తరాది దేవుడంట, శివుడు దక్షిణాది దేవుడంట.. దేవుళ్లకు సంబంధించి ఇదేం విభజననో అర్థం కాదు.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా నెత్తిన ముత్యాల తలంబ్రాలు పెట్టుకుని వెళ్లి, సాష్టాంగ ప్రణామం చేసి సమర్పణ చేసుకున్న దేవుడు ఎవరు? రాముడే కదా..! గోదావరి తీరంలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. ఉన్న సీతారాములకు ఆలయం కట్టడానికి డబ్బులు ఇచ్చిన వాళ్లు అంతా ఎవరు? ఆ గోదావరి తీరంలో ఉండే పేద ప్రజలు కాదా? భద్రాచలం ఏజెన్సీలో ఇప్పటికీ ఉండే ప్రజలు ఎవరు? అక్కడ రామస్వామిని కనుక్కొన్న దమ్మక్క కోయ మహిళ. అక్కడ ఉండే ప్రజల్లో అత్యధికులు కోయలు, కొండ్రెడ్డులు, బంజారాలు.. వాళ్లందరూ కలిసి నిర్మించుకున్న దేవాలయం అది. స్థానిక గిరిజన సంప్రదాయాలతో ముడిపడిన దేవుడు భద్రాచల రాముడు.
అలాంటి రామచంద్రుడు ధనికుల దేవుడు ఎలా అవుతాడు? ఆ ఆలయాన్ని నిర్మించినందుకు పన్నెండేండ్లు చెరసాలలో మగ్గి సర్వస్వం ధారపోసిన భక్త రామదాసు త్యాగం ఇప్పుడు ఏమైపోయినట్టు? భద్రాద్రి కోదండరాముడి అస్తిత్వం, రామదాసు కీర్తనల వైభవం ఏమైపోయినట్టు? ఇప్పుడు ఆలయ అభివృద్ధికోసం అంటూ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నామని చెప్తున్నారే.. దేనికోసం పెడుతున్నట్టు? ముఖ్యమంత్రి ఇవన్నీ మర్చిపోయినట్టున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఎన్ని రామాలయాలు ఉన్నాయో ఒకసారి దేవాదాయ శాఖను అడిగి తెలుసుకుంటే మంచిది. కుతుబ్ షాహీ రాజు తానీషా స్వయంగా స్థాపించిన తలంబ్రాల సమర్పణ సంప్రదాయాన్ని ఇవాళ్టికీ ప్రభుత్వాలు నేటికీ పాటిస్తున్నాయంటే.. దానికి కారణం భద్రాద్రి రాముడు తెలంగాణ సాంస్కృతిక జీవన వైభవానికి నిలువెత్తు ప్రతీక. అక్కడి స్థానిక కథనమే చెప్తున్నదేందంటే.. రాములవారి పర్ణశాలే ఇక్కడ ఉన్నదని.
ఇక్కడి గోదావరి తీరంలోనే సీతారాములు పదేండ్లకు పైగా జీవించారని, ఇక్కడే సీతాపహరణం జరిగిందని.. ఇంత గొప్పగా సీతారాముల వనవాస కథనాలతో అనుసంధానం అయిన గొప్ప క్షేత్ర సంస్కృతిని దెబ్బ తీసేవిధంగా రాముడిని ఉత్తరాది వాడంటూ చిన్న చేయడం అంటే ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని చిన్నచేయడమే అవుతుంది.
తెలంగాణలో శివకేశవ ఆలయాలు లేని ఊరు ఒక్కటంటే ఒక్కటైనా చూపగలరా? భద్రాచలంలో, ఇల్లందకుంటలో, అమ్మపల్లిలో, రాచకొండలో, ధర్మపురిలో, డిచ్‌పల్లిలో రాముడి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ఇక తెలంగాణ గ్రామ గ్రామాన సీతారామ, కోదండరామ, రామచంద్రస్వామి దేవాలయాలు చాలా ఉన్నాయి. మరి రాముడు ఉత్తర భారత దేవుడు ఎలా అవుతాడు? రామ సంస్కృతి ఉత్తర భారత సంస్కృతి ఎలా అవుతుంది? అసలు శివకేశవ భేదం సృష్టించడం ద్వారా ముఖ్యమంత్రి సమాజాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో తెలియడంలేదు. భద్రాచలంలోనే భద్రాద్రికి అనుబంధంగా ఉన్న రంగనాయకుల గుట్టపై రామలింగేశ్వరస్వామి ఆలయం ఉన్నది. ఇల్లందకుంటలో త్రికూట నిర్మాణంలో శివలింగం ఉంటుంది. శిర్సనగండ్లలో రామాలయం, రామలింగేశ్వరుడు కలిసి ఉంటారు. బ్రాహ్మణ కొత్తపల్లిలో రాణి రుద్రమదేవి నిర్మించిన పట్టాభి సీతారామస్వామి ఆలయంలో అత్యంత పురాతనమైన శివ సన్నిధి ఉన్నది. తెలంగాణే కాదు.. మన ఆరాధన సంప్రదాయంలో శివ, కేశవ ఆరాధనలు పరస్పర విరోధాలు కావు. ఒకే క్షేత్ర సంప్రదాయంలో కలిసి ఉండేవి. రాముడు చెప్తేనే పోతన భాగవతాన్ని రాశాడు కదా..! మరి ఏ ప్రాతిపదికన శివుడు పేదల దేవుడు, రాముడు ధనికుల దేవుడు అని సీఎం విభజన రేఖ గీస్తున్నారు.
గతంలోనూ తెలంగాణలో మతపరమైన రాజకీయాలు చేసి సమాజాన్ని చీల్చే కుట్రలు చాలా జరిగాయి. కానీ, మన సమాజం ఇలాంటి రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదు. ఇక్కడ ప్రజల్లో భక్తి ఉన్నది కానీ, మతోన్మాదం లేదు. మనుగడ కోసం దాదాపు 800 వందల ఏండ్లపాటు పోరాటం చేసిన సమాజం ఇది. అధిక్షేపం ఇక్కడి రక్తంలోనే ఉన్నది. పోతన లాంటి వాడే నా కావ్యాన్ని ఎవ్వడికీ ఇవ్వను పొమ్మన్నాడు. అలాంటిది ఉత్తరాదిలో మాదిరిగా ఇక్కడ మత రాజకీయాలు ప్రభావం చూపుతాయని అనుకోవడం భ్రమే. ఈ విషయం తెలంగాణలో బీజేపీ పరిస్థితి చూస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది.
ఇక రాష్ట్రంలో బీజేపీకి తాను విధేయుడనని చాటుకోవడానికి అవకాశం దొరికినప్పు డల్లా రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజా వ్యాఖ్యల్లో కూడా మోదీ నాలుగోసారి ఎలా గెలువాలో, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలో ఒక ఏబీవీపీ మాజీ కార్యకర్తగా చిట్కా చెప్పారు కూడా. పాపం ఒరిజినల్ కాంగ్రెస్ వారికే ఈ వ్యవహారం అర్థం కావటం లేదు. లేదా.. తమకు వేరే ప్రత్యామ్నాయం లేక భరిస్తున్నారేమో తెలియదు. మరోవైపు ద్రవిడ ఉద్యమం అనేది ప్రధానంగా తమిళనాడుకే పరిమితమైంది. కొంతవరకు ఏపీ రాజకీయాలను తొలినాళ్లలో ప్రభావితం చేసింది. కానీ, తెలంగాణకు ఇలాంటి రాజకీయాలు పడవు. మనది పూర్తిగా లౌకిక ప్రజాస్వామ్య సమాజం. ఈ సమాజాన్ని మతపరమైన, జాతిపరమైన పరస్పర విరుద్ధమైన, చీలిక రాజకీయాలతో ప్రభావితం చేయడం సాధ్యమయ్యేపని కాదు. చివరగా ఒక్కమాట.
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే,శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
విష్ణు రూపంలో ఉన్న శివుడికి నమస్కారం.. శివుడి రూపంలో ఉన్న విష్ణువుకు నమస్కారం. శివుని హృదయంలో విష్ణువు ఉన్నాడు.. విష్ణువు హృదయంలో శివుడు ఉన్నాడని దీని అర్థం. ఈ ఒక్క శ్లోకం మన సమాజంలో వేల ఏండ్లుగా కొనసాగుతున్న సమన్వయ సంప్రదాయానికి ప్రతిబింబం. అలాంటి సమాజంలో ఫలానా దేవుడు ధనికుల దేవుడు, ఫలానా దేవుడు పేదల దేవుడు అంటే ప్రజలు నవ్వుకోరా.. అలా మాట్లాడినవాళ్లు నవ్వులపాలు కారా? ఆ మాత్రం లాజిక్ మిస్ అయితే ఎలా? ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎలా?
కోవెల సంతోష్‌కుమార్