వెంగళరావునగర్, సెప్టెంబర్ 29: ప్రియురాలితో కలిసి హోటల్ గదిలో బస చేసి రాడ్డుతో కొట్టి హత్య చేశాడు ప్రియుడు..అనంతరం గదికి తాళం వేసి పరారైన ఘటన ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా లు..వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం నాగసముద్ర గ్రామానికి చెందిన శిరీష (34) ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వహిస్తోంది. 2013లో వివాహం కాగా మనస్పర్థాల కారణంగా 20 16లో భర్త నుంచి విడాకులు తీసుకుంది. సినీ పరిశ్రమలో డైరెక్టర్ల వద్ద పని చేస్తున్నట్లు చెప్పుకునే వికారాబాద్ జిల్లా పెద్దేముల్ , ఓగులాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు శిరీష చెప్పడంతో నిరాకరించారు. కాగా శ్రీనివాస్ శిరీషను ఓ గుడికి తీసుకుపోయి తాళి కట్టాడు. అయితే శిరీష తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. శిరీష, శ్రీనివాస్ అప్పడప్పుడు లాడ్జీల్లో కలుసుకుంటుండేవారు. ఈ నెల 24న వీరిద్దరూ గణేశ్ , దుర్గా అనే మారుపేర్లతో అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని గోకుల్ ప్రైడ్ హోటల్ లో గది నంబర్ 103లో దిగారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో శ్రీనివాస్ గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. శిరీష అల్పాహారం చేసిన తర్వాత గది ఖాళీ చేస్తుందని హోటల్ సిబ్బందికి చెప్పినట్లు తెలిపారు.
ఉదయం 9 గంటలు దాటినా ఎలాంటి స్పందన రాకపోవడంతో సిబ్బంది అనుమానంతో మారు తాళంతో తలుపు తెరిచి చూడగా.. బెడ్ పై శిరీష విగతజీవిగా కనిపించింది. గది మొత్తం చిందరవందరగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సార్‌నగర్ పోలీసులు, క్లూస్ టీం ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. శిరీష శరీరంపై, వీపుపై పలు గాయాలు ఉన్నట్లు గుర్తించారు. టీవీ శబ్ధాన్ని భారీగా పెంచి.. కర్టెన్ రాడ్డుతో ఆమెను తీవ్రంగా కొట్టడంతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 22న నగరానికి వచ్చిన సమయంలోనూ శ్రీనివాస్ శిరీషను కొట్టి ఎల్లారెడ్డిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు దర్యాప్తులో తేలింది. గతంలో శ్రీనివాస్ పై పలు కేసులు నమోదైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. శిరీష సోదరుడు రవీందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.