Warangal | ‘దేవుడు పోయి.. దయ్యం వచ్చినట్టయ్యింది! మేం సచ్చినమా? బతికినమా? అని కనీసం సూత్తలేరు. మా ఎమ్మెల్యే ఎవరో గూడ తెల్వదు. ఆయనను (కేసీఆర్) యాది చేసుకుంట ఇట్ల బతుకుతున్నం..’ అని వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక రైతన్నల పరిస్థితి ఆగమైంది. ఓ వైపు రైతుబంధు అందక, రుణమాఫీ కాక, సాగునీరు అందక అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాగునీరు లేక, చెరువులు ఎండిపోయి, భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రైతులు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాలకుర్తికి చెందిన మహిళా రైతు ఆక్రోషం వెళ్లగక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఆమె మాటలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పంటలు ఎండి.. గుండెలు మండిన ఆ రైతు ఆవేదన ఆమె మాటల్లోనే… ‘ఐదెకరాల్లో వరి సాగు చేసినం. మా బోరు నీళ్లు కొంత, కాల్వ నీళ్లు కొంత వస్తయని పంట ఏసినం.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. మా మీద సావు దెబ్బ కొట్టింది. ఏం లేదు. మొత్తం ఎండుకుపోయింది. దయాకర్ సార్ మమ్మల్ని ఆదుకున్నడు. మా ఎమ్మెల్యే ఎవరో గూడ తెల్వదు. కేసీఆర్ సార్, మా దయన్న సార్ నీళ్లు విడిచిపెట్టిండ్రు. అబద్ధం ఎందుకు ఆడాలె. ఆ ప్రభుత్వంలో ఎప్పుడు పంటలు ఎండలె. మస్తు వడ్లు పండినయి. మస్తు బతికినం. ఇప్పుడైతే ఏం లేదు ఇగ. మాకు సావే ఉంది ఇగ. పొలాన్ని జూత్తే గుండెపోటు వస్తాంది. రైతుబంధు లేదు, మాఫీ లేదు, ఏ బంధు లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో మస్తు ఉండె. తల్లిదండ్రులు కూడా యాది రాలె. అట్ల ఉండె ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ సారు (కేసీఆర్) పోయిండు.. ఆ సారూ (ఎర్రబెల్లి దయాకర్) పోయిండు. ఇగ ఉరి పెట్టుకొని సావడమే ఉంది. సచ్చిర్రా, బతికిర్రా అని సూసేటోళ్లే లేరు. మూడు మూడుసార్లు యూరియా, డీఏపీ ఏసినం. మొత్తం వేసినం. ఒక్క ఎకరానికి ఏడు వేలు, ఎనిమిది వేలు ఇస్తే నాట్లేసిర్రు. కూలీ బతుకు చేసుకుంటే అయిపోయేది. ఇట్ల వ్యవసాయం జేస్తే నాశనమైంది. అంటరుగా దేవుడు పోతే దయ్యం వస్తదని.. ఆ దేవుడు పోయిండు, దయ్యం వచ్చింది’ అని మహిళా రైతు తెలిపారు.