Adilabad | తాంసి, సెప్టెంబర్ 14: ‘నా కుమారుడికి డెంగ్యూ సోకింది. పంచాయతీ కార్యదర్శి మురుగు కాలువలు శుభ్రం చేయించకపోవడంతో దోమలు విజృంభించి రోగాలు సోకుతున్నాయి. మరొకరు డెంగ్యూ బారిన పడకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టి సదరు కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి’ అని ఆదిలాబాద్ జిల్లాలో ఓ బాధితుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా.. తాంసి మండలం బండల్నాగాపూర్లోని తన ఇంటి పరిసరాల్లో 9 నెలలుగా పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని పోతెమ్ నవీన్ తెలిపాడు.
ఇదే విషయాన్ని జూలై 7న కార్యదర్శి హమీద్ దృష్టికి తీసుకెళ్లితే.. మురుగు కాల్వలు ఆన్లైన్ కాలేదని సమాధానం ఇచ్చాడని, ఫలితంగా ఈ నెల 9న తన కొడుకు వృషీన్ డెంగ్యూ బారిన పడినట్టు పేర్కొన్నాడు. చికిత్సకు రూ.57 వేలు ఖర్చు అయిందని తెలిపాడు. గతంలో తన కూతురు వైశాలి (7) కూడా డెంగ్యూతోనే మృతి చెందిందని వాపోయాడు. తన కొడుకు డెంగ్యూ బారిన పడటానికి కారణమైన పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు.