రఘునాథపాలెం, ఏప్రిల్ 5 : ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు వెంబడించడంతో తప్పించుకొనేందుకు పరిగెత్తిన యూపీ కార్మికుడు చెరువులో దూకి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఖమ్మం నగర పరిధి జయనగర్‌కాలనీకి ఆనుకొని ఉన్న ఖానాపురం చెరువు వద్ద చోటుచేసుకున్నది. ఖానాపురం హవేలీ పోలీసుల కథనం ప్రకారం..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన వినయ్ (21) బతుకుదెరువు కోసం ఖమ్మం వచ్చి దానవాయిగూడెంలో నివాసం ఉంటున్నాడు. మార్బుల్ పనులు నిర్వహించే వినయ్, తన మేస్త్రీ అజయ్ ఠాగూర్‌తో కలిసి ఖమ్మం నగరానికి చెందిన మోహన్సాయి ఫైనాన్స్‌లో ద్విచక్ర వాహనాలకు ఫైనాన్స్ తీసుకున్నారు. వినయ్ వాహనంపై రూ.4 వేలు, మేస్త్రీ అజయ్ఠాగూర్ వాహనంపై రూ.14 వేలు బకాయిలు ఉన్నాయి.
వినయ్ వాహనాన్ని ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు రామచందర్, అజయ్ కుమార్ నాలుగురోజుల క్రితమే స్వాధీనపర్చుకున్నారు. శుక్రవారం జయనగర్ కాలనీలో పనులు నిర్వహిస్తున్న వినయ్ వద్దకు వచ్చిన రికవరీ ఏజెంట్లు డీ రాంచందర్, అజయ్‌కుమార్ మేస్త్రీ వాహన విషయమై నిలదీశారు. దీనిపై వారి మధ్య వాగ్వాదం జరగడంతో వినయ్ తప్పించుకునేందుకు పరుగుతీశాడు. రికవరీ ఏజెంట్లు బైక్‌పై వినయ్‌ని వెంబడించారు.
పరిగెత్తుకుంటూ ఖానాపురం చెరువువైపుగా వచ్చిన వినయ్ తప్పించుకోవాలని అందులోకి దూకాడు. ఈత రాక వినయ్ చెరువులో మునిగి ప్రాణాలు వదిలాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై సంతోశ్ తెలిపారు.