Asifabad | కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కొన్ని నెలలుగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) – మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులిని ఎట్టకేలకు మంగళవారం రాత్రి చంద్రాపూర్ అటవీ అధికారులు బోనులో బంధించారు. ఈ పులిని పట్టుకునేందుకు మహారాష్ట్ర అటవీ అధికారులు వారం రోజులుగా ప్రయత్నిస్తున్నారు. సిర్పూర్(టీ) మండలం – మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామమైన అంతర్గాం అటవీ ప్రాంతంలో మగ పులికి మత్తుమందు ఇచ్చి బోనులో బంధించి ఆపై చంద్రాపూర్‌కు తరలించినట్టు తెలిసింది. పులికి అవసరమైన వైద్యసేవలు అందించిన తర్వాత తడోబా పులుల సంరక్షణ కేంద్రంలో వదిలివేయనున్నట్టు సమాచారం. దాదాపు రెండు నెలలుగా కౌటాల, సిర్పూర్(టీ) మండలాల్లోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తున్న పులి వేటగాళ్ల బారిన పడే ప్రమాదం ఉండటంతో చంద్రాపూర్ అటవీ అధికారులు అప్రమత్తమై పులిని బోనులో బంధించారు. ఈ విషయమై ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. పులులను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తున్నది.
మ్యాన్ ఈటర్‌గా మారిన పులి
సరిహద్దు గ్రామాల్లో ఇద్దరిపై దాడి చేసి ఒకరి ప్రాణాలు తీసి మ్యాన్ ఈటర్‌గా మారిన పులిని ఎట్టకేలకు పట్టుకోవడంతో ఇటు అధికారులు.. అటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత నవంబర్ 29న కాగజ్‌నగర్ మండలం గన్నారం సమీపంలో పత్తి చేనుల్లో పనిచేస్తున్న లక్ష్మిపై దాడిచేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరుసటి రోజు సిర్పూర్(టీ) సమీపంలోని పత్తిచేనులో పని చేసుకుంటున్న రైతు సురేశ్‌పై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రెండు నెలల కాలంలో అక్కడక్కడ సంచరిస్తూ తరచూ పశువులపై దాడి చేసింది.