HCU | సిటీబ్యూరో/కొండాపూర్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): పాపం జింకలు.. ఒక్కొక్కటిగా కుక్కల చేతిలో పాశవికంగా మృత్యువాత పడుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో రేవంత్ సర్కార్ బుల్డోజర్లు వందల ఎకరాల్లోని ఆకుపచ్చని అడవులను తుడిచిపెట్టడంతో.. అక్కడ నివాసముంటున్న వన్యప్రాణులు ఎటు వెళ్లాలో తెలియక జనావాసాల్లోకి వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. మొన్నటి వరకు హెచ్సీయూలో రెండు జింకలు చనిపోగా.. తాజాగా మరో జింక బుధవారం సాయంత్రం విగతజీవిగా కనిపించింది.
సెంట్రల్ వర్సిటీలోని చెక్ డ్యాం సమీపంలో ఆ జింక ఎటు వెళ్లాలో తెలియక తచ్చాడుతుంటే కుక్కల గుంపు దానిపై పడి విచక్షణారహితంగా కరిచాయి. జింక మృతదేహాన్ని వర్సిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి తెలివి తక్కువ నిర్ణయం వల్లే వన్యప్రాణులు చనిపోతున్నాయంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
పచ్చని అడవులను తొలగించడమే కాకుండా అక్కడ జింకలు లేవు.. గుంట నక్కలే ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. యూనివర్సిటీలో జింకలు మృతి చెందుతున్నా.. తమకేమీ పట్టనట్టు వర్సిటీ భూములు తమకు చెందినవేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బోర్డులు ఏర్పాటు చేయడం వారి కర్కశత్వానికి నిదర్శనం అని మండిపడుతున్నారు.