హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ‘తెలంగాణ హరితోత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం అన్ని జిల్లాల అటవీ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటడం కోసం అవసరమైన ప్లాంట్ మెటీరియల్ సిద్ధం చేయాలని ఆదేశించారు. పచ్చదనం పెంపునకు కృషి చేసిన ప్రజాప్రతినిధులకు సన్మానించాలని సూచించారు.
ఇక హరితహారం విజయాలను తెలియజేసేలా పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పా టు చేయాలని చెప్పారు. వర్షాలను దృష్టిలోపెట్టుకొని సరైన నీటివసతి ఉన్న భూముల్లోనే మొక్కలు నాటాలని సూచించారు. రుతుపవనాలు పూర్తిగా విస్తరించిన తర్వాతే తొమ్మిదో విడత హరితహారాన్ని ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. పర్యావరణ సృ్పహ పెరిగేలా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. గ్రామాలు, మండలాల్లో కొత్తగా మొకలు నాటే ప్రాంతాలకు ‘దశాబ్ది వనాలు’గా పేరు పెట్టాలని సూచించారు.