హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో అర్థ గణాంక, ప్రణాళిక శాఖలను క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో అర్థ గణాంకశాఖ డైరెక్టర్ దయానంద్, రాష్ట్ర, జిల్లా ప్రణాళిక అధికారులతో వినోద్‌కుమార్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో అర్థ గణాంక, ప్రణాళిక శాఖలు కీలకపాత్ర పోషిస్తున్నాయని, వీటి బలోపేతానికి పలువురు ఐఏఎస్‌లు, రాష్ట్రస్థాయి అధికారులకు ఈ శాఖల్లో పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం ఈ శాఖలు అనుసరిస్తున్న విధానాలు సంతృప్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పలు అంశాలపై అధ్యయనానికి కర్ణాటక, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌లలో పర్యటించాల్సి ఉన్నదని డైరెక్టర్ దయానంద్ వివరించగా, కార్యాచరణను సిద్ధం చేయాలని వినోద్‌కుమార్ సూచించారు. ఈ సమావేశంలో గణాంకశాఖ అధికారులు శివకుమార్, కస్తూరి వెంకట్, వేణుమాధవ్, నరసింహాచారి, హరికృష్ణ, బాబూరావు, వెంకటేశ్వర్లు, అశోక్, వెంకటరమణ, మాన్య తదితరులు పాల్గొన్నారు.