హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత రంగం అభివృద్ధికి తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని మహారాష్ట్ర అధికారుల బృందం ప్రశంసించింది. 40 శాతం నూలు రాయితీ, నేతన్న బీమా, నేతన్నకు చేయూత తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడింది. తమ రాష్ట్రంలో కూడా వీటి అమలుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. మహారాష్ట్ర టెక్స్టైల్ శాఖ కమిషనర్ నేతృత్వంలోని అధికారుల బృందం ఆది, సోమవారాల్లో తెలంగాణలో పర్యటించింది. సిరిసిల్ల, సిద్దిపేట, పోచంపల్లి తదితర ప్రాంతాలను సందర్శించింది. నేత పద్ధతులు, డిజైన్లను పరిశీలించింది.
గొల్లభామ, రామప్ప పట్టుచీరల తయారీని చూసి అధికారులు అబ్బురపడ్డారు. చేనేత మిత్ర, నేతన్న బీమా, నేతన్నకు చేయూత, జియో ట్యాగింగ్లాంటి పథకాల ప్రయోజనాలను నేతన్నలతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్తో ఆయన కార్యాలయంలో మహారాష్ట్ర అధికారుల బృందం సమావేశమైంది. చేనేతల తలరాత మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మంచి పథకాలను ప్రవేశపెట్టిందని ప్రశంసించింది. కాగా, రాష్ర్టానికి జాతీయ, అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమలు వచ్చేలా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టేలా మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని బుద్ధప్రకాశ్ వివరించారు.