మహదేవపూర్, జూన్ 20 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అన్నారం బరాజ్‌ను సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం గురువారం సందర్శించింది. పుణెకు చెందిన జియోఫిజికల్ శాస్త్రవేత్త డాక్టర్ ధనుంజయ్ నాయుడు నేతృత్వంలోని నిపుణుల బృందం బరాజ్‌ను పరిశీలించింది. బృందం సభ్యులు ఇంజనీరింగ్ అధికారులతో సాంకేతిక అంశాలపై చర్చించారు. బరాజ్‌లో 22 నుంచి 44 గేట్ల వద్ద చేపట్టిన సీపేజ్, మరమ్మతు పనులను పరిశీలించారు. వారి వెంట రామగుండం సర్కిల్ సీఈ సుధాకర్‌రెడ్డి, ఎస్ఈ కరుణాకర్, ఈఈ యాదగిరి, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. అలాగే మేడిగడ్డ బరాజ్ వద్ద నిపుణుల బృందం ఆధ్వర్యంలో ఈ నెల 5న ప్రారంభమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. బరాజ్‌లో లోపాల అధ్యయనానికి కుంగిన పియర్ల సమీపంలో డ్రిల్ చేసి నమూనాలు సేకరిస్తున్నారు. వీటిని పుణెకు పంపించి పరీక్షించనున్నట్టు తెలిసింది. ఏడో బ్లాక్ వద్ద బరాజ్ దిగువన షీట్ ఫైల్స్, గ్రౌటింగ్, సీసీ బ్లాక్‌ల రీఅరేంజ్మెంట్ పనులు జరుగుతున్నాయి. 20వ గేట్‌ను కట్ చేయగా విడిభాగాల తొలగింపు పక్రియ కొనసాగుతున్నది. ఈ పనులను భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు గురువారం పరిశీలించారు.