హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : అధికారుల కాఠిన్యం, ఉదాసీనతతో కాలు, చేయి విరిగిన విద్యార్థిని ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. సహాయం చేయండని మొత్తుకొన్నా అధికారులు కరుణించలేదు. వివరాల్లోకెళ్తే.. దిశ అనే విద్యార్థి గత మార్చిలో రోడ్డు ప్రమాదానికి గురైంది. కాలు, చెయ్యి విరగడంతో అప్పట్లో రెగ్యులర్ పరీక్షలకు హాజరుకాలేకపోయింది. కాస్త ఆరోగ్యం కుదుటపడగా తాజాగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాసేందుకు సిద్ధపడింది.
అమెకు హైదరాబాద్ అల్వాల్‌లోని విజ్ఞానభారతి జూనియర్ కాలేజీలో పరీక్షాకేంద్రాన్ని కేటాయించారు. వీల్‌చైర్‌లో దిశను తీసుకొని పరీక్షాకేంద్రానికి వచ్చిన తల్లిదండ్రులు అవాక్కయ్యారు. లిఫ్ట్లేకపోవడం, రెండో అంతస్తులో పరీక్షాకేంద్రాన్ని కేటాయించడంతో అక్కడున్న అధికారులను వేడుకొన్నారు. దీంతో దిశను స్ట్రెచర్‌పై పరీక్షా హాల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. దిశ దుస్థితిని ఆమె తల్లి బంబినరాజు నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు ఆమెకు శనివారం బొల్లారంలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజీలో పరీక్షాకేంద్రాన్ని కేటాయించారు. తాను సహాయకురాలి సాయంతో ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నట్టు దిశ తెలిపారు.