కరీంనగర్ రాంనగర్, జూలై 9: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలోని అంధుల పాఠశాలలో ఓ అంధ విద్యార్థి మెడకు టవల్ బిగుసుకుని మృతి చెందాడు. ఈ ఘటనకు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతు డి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన దాన శ్రీవాత్సవ్ (12) రేకుర్తిలోని అంధుల పాఠశాలలో చదువుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం గదిలోకి వచ్చిన శ్రీవాత్సవ్.. వానకాలం కావడంతో బట్టలు ఆరేసేందుకు గదిలో వైరుతో దండెం కట్టాడు.
దానిపై ఆరేసిన టవల్‌తో తోటి సహచరులతో కలిసి శ్రీవాత్సవ్ ఆడుకుంటుండగా టవల్ మెడకు బిగుసుకుపోయి మృతి చెందాడు. సహచరులు కూడా అంధులే కావడంతో ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. అప్పుడే క్లాసులకు హాజరైన తోటి విద్యార్థులు గదిలోకి రాగానే దుర్వాసన వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన అంధ విద్యార్థులు అక్కడి సిబ్బందికి విషయం తెలిపారు. వెంటనే పాఠశాల సిబ్బంది అతడిని దవాఖానకు తరలించగా అప్పటికే శ్రీవాత్సవ్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.