హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌లో వింత పరిస్థితి నెలకొంది. కొత్త మండలాలు ఏర్పడినా ఆయాచోట్ల సరిపడా పోస్టులను భర్తీ చేయలేదు. ఉన్న సిబ్బందే ఇంకా పాత మండలాల వారిగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త మండలాలకు సిబ్బందిని నియమించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తింది. సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌లో ఎంఐఎస్ కో ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెసెంజర్, ఐఈఆర్పీ, సీఆర్పీలు పనిచేస్తారు. వీరంతా మండలం కేంద్రంగా విధులు నిర్వహిస్తారు.
అయితే కొత్త మండలాల ఆవిర్భావం తర్వాత 957మంది ఉద్యోగుల అవసరమున్నట్లు అధికారులు తేల్చినా కొత్త వారిని మాత్రం నియమించలేదు. చాలా ప్రాంతాల్లో జిల్లా, మండలాలను పునర్వ్యవస్థీకరణకు ముందు ఉన్న పాత మండలాల వారీగానే కొనసాగుతోంది. కొన్నిచోట్ల మాత్రం ఉన్నవారినే సర్దుబాటు చేశారు. ఎమ్మార్సీ(మండల వనరుల కేంద్రం)ల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత సమస్య వేధిస్తున్నది.