జనగామ : యూరియా కోసం రైతుల పడిగాపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద రైతులు క్యూలైన్లలో నిల్చుని సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు అనేకం చూశాం. తాజాగా ఓ రైతు యూరియా కోసం క్యూలో నిలబడి పాము కాటు గురయ్యాడు.
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ గ్రామంలోని సెంటర్ వద్ద, యూరియా కోసం రైతు ధరావత్ బాలు(50) క్యూలో నిలబడ్డాడు. దీంతో చెట్ల పొదల్లో నుంచి వచ్చిన పాము రైతును కరిచింది. పాము కాటుకు విలవిలలాడిపోయిన రైతు.. నేలకొరిగాడు. అప్రమత్తమైన తోటి రైతులు బాధిత రైతును చికిత్స నిమిత్తం వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డాక్టర్లు లేకపోవడంతో సూర్యాపేటకు తరలించారు. ప్రస్తుతం రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.