స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం వెల్లువై సాగిన జాతీయోద్యమంలో దేశభక్తిని చాటే నినాదం.. ‘వందే మాతరం’. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సాగిన వందేమాతరం స్ఫూర్తి దావానలమై భారత ఉపఖండమంతా విస్తరిస్తూ హైదరాబాద్‌నూ అంటుకుంది. ఉద్యమాల ఉస్మానియాలో మొట్టమొదటి ఉద్యమంగా ‘వందేమాతర ఉద్యమం’ చరిత్రకెక్కింది. ఉద్యమం ఉగ్గుపాలుతాపి భవిష్యత్ రాజకీయాలకు ఎందరో చరితార్థులను అందించింది వందేమాతరం.
బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలో లేకపోవడం వల్ల ఆనాటి వందేమాతర ఉద్యమ ప్రకంపనలు నైజాం రాజ్యంలో లేవు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత విద్యార్థి లోకంలో వందేమాతరం ఓ రణనినాదంగా మారి రాజకీయ చైతన్య స్ఫూర్తిని రగిలించింది. అందులో భాగంగానే స్వదేశీ భావాల వ్యాప్తి, విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ ఉద్యమం రాజుకున్నాయి. ఆ ఉద్యమ చైతన్యం అనేక రూపాల్లో విస్తరించింది. వందేమాతర ఉద్యమంతో స్వదేశీ భావాలు వ్యాప్తిలోకి వచ్చాయి.
గొంతునొక్కితే.. గర్జించిన గళాలు
నిశ్శబ్దంగా ఉన్న హైదరాబాద్ రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఆలాపన సంచలనం సృష్టించింది. విద్యా సంస్థలు, గ్రంథాలయోద్యమాల ప్రభావం విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించింది. దసరా ఉత్సవాల (1938) సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బీ-హాస్టల్ విద్యార్థులు కొందరు ప్రార్థనా మందిరంలో వందేమాతర గీతం ఆలపించారు. వందేమాతర గీతాన్ని పాడుతున్నారనే కారణంతో బీ హాస్టల్ ప్రార్థనా మందిరాన్ని వార్డెన్ మూసివేశాడు. ఆ ప్రార్థనా మందిరాన్ని కొంతకాలం తర్వాత తెరుస్తారని విద్యార్థులు భావించారు.
ఈలోగా రంజాన్ సెలవులు వచ్చాయి. నెల తర్వాత.. 28 నవంబరు 1938న విశ్వవిద్యాలయం తెరిచారు. ఆ రోజే హాస్టళ్లలోని ప్రార్థనా మందిరంలో వందేమాతరం ఆలపించకూడదని నిషేధం విధిస్తూ విశ్వవిద్యాలయం ప్రకటన జారీ చేసింది. నిషేధాన్ని ఎత్తివేయాలని, వందేమాతరం రాజకీయపరమైనది కాదని, వివాదాస్పదమైనది కాదని విద్యార్థులు ప్రో-చాన్సలర్కి విన్నవించారు. ఆయన విద్యార్థుల విన్నపాన్ని తిరస్కరించాడు. అంతేకాదు ఆ విద్యార్థులను కళాశాల నుంచి, హాస్టళ్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అదే రోజు ప్రకటించాడు. అయినా విద్యార్థులు వందేమాతర గీతాన్ని ఆలపించడం ఆపలేదు.
నినదిస్తే బహిష్కారం
బహిష్కృత విద్యార్థుల్ని అధికారులు అదే రోజు బలవంతంగా పంపించారు. ఈ అమానుష ఘటన నగరంలోని విద్యార్థుల్లో ఆగ్రహం రగిలించింది. ఉస్మానియా విద్యార్థులకు మద్దతు ప్రకటిస్తూ విద్యార్థులు సమ్మెకు దిగారు. జిల్లాల్లోని హైస్కూల్, కాలేజీ విద్యార్థులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమ్మెకు అపూర్వమైన ఆదరణ లభించింది. నియమాల ప్రకారం విద్యార్థులు ఫైజమా, నీలిరంగు షేర్వాణీ ధరించి తరగతులకు హాజరుకావాలి. దీనిని ఉల్లంఘిస్తూ సంప్రదాయమైన తెల్లని ధోవతి, అంగి ధరించారు. నవంబరు 29న మొదలైన విద్యార్థి సమ్మె డిసెంబరు 10న ముగిసింది.
విద్యార్థులు సమ్మె విరమించినా ప్రభుత్వం శాంతించలేదు. ఈ విప్లవాగ్నుల్ని ఇంతటితోనే ఆర్పేయాలని సంకల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం డిసెంబరు 12న 350 మంది విద్యార్థులను బహిష్కరించింది. ఏడుగురు సిటీ కాలేజీ విద్యార్థులు, 120 మంది మహబూబ్‌నగర్ హైస్కూల్ విద్యార్ధులు బహిష్కృతులయ్యారు. వరంగల్లు పట్టణంలోని విద్యా సంస్థల్లో వందేమాతర ఉద్యమానికి మద్దతుగా విద్యార్థులు సమ్మెలో పాల్గొన్నారు. అందులో పాల్గొన్నవారిని కూడా బహిష్కరించారు. వందేమాతరం ఉద్యమ కాలంలో మొత్తం రెండు వేలకు పైగా విద్యార్థులను బహిష్కరించారు. వీరిలో పీవీ నరసింహారావుతోపాటు చాలా మంది నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరారు. వీరందరూ కలిసి అక్కడ ‘వందేమాతరం స్టూడెంట్స్ యూనియన్’ని ఏర్పాటు చేసుకున్నారు.
ఆనాటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మూడు హాస్టళ్లుండేవి. ప్రతి హాస్టల్లోనూ రెండు ప్రార్థనా మందిరాలుండేవి. ఒక ప్రార్థనా మందిరాన్ని హిందూ విద్యార్థులకు, మరొక ప్రార్థనా మందిరాన్ని ముస్లిం విద్యార్థులకు కేటాయించారు. ఆయా మతాలకు చెందిన విద్యార్థులు ప్రార్థనలు చేసుకునేందుకు, ఉత్సవాలు జరుపుకునేందుకు ఏ ఆటంకమూ ఉండేది కాదు.
జాతీయోద్యమ మద్దతు
హైదరాబాద్ వందేమాతర ఉద్యమం దేశ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. భారత జాతీయోద్యమ నాయకులను ఈ ఉద్యమం ఆకర్షించింది. గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ విద్యార్థులను ప్రోత్సాహిస్తూ లేఖలు రాశారు. ప్రార్థనా మందిరాల్లో వందేమాతరం గీతాన్ని పాడుకునేందుకు విద్యార్థులకు సర్వహక్కులూ ఉన్నాయని మహాత్మాగాంధీ విద్యార్థులకు ఒక సందేశం పంపారు. భారత స్వాతంత్య్రోద్యమంలో హైదరాబాద్ విద్యార్థుల వందేమాతర ఉద్యమం చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది.
బహిష్కృతులు.. భవిష్యత్ మహానేతలు
హైదరాబాద్‌లో వందేమాతర ఉద్యమంలో పాల్గొని బహిష్కృతులైన విద్యార్థులు నాటి ప్రభుత్వ ఆంక్షలకు లొంగక తమ ఆకాంక్షల కోసం.. స్వాతంత్య్రం కోసం ఉద్యమిస్తూనే, చదువులకోసం దూర ప్రాంతాలకు బయలుదేరారు. బహిష్కృత విద్యార్థుల్ని ఇతర విశ్వవిద్యాలయాల్లో చేర్చుకోవద్దని ఇంటర్ యూనివర్సిటీ బోర్డును ఉస్మానియా విశ్వవిద్యాలయం కోరింది. అయినా వారిని చేర్చుకునేందుకు నాగపూర్ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఆనాటి వందేమాతర ఉద్యమంలో పీవీ నరసింహారావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, నూకల రామచంద్రారెడ్డి, హయగ్రీవాచారి, అచ్యుత రెడ్డి మొదలైన బహిష్కృత విద్యార్థులంతా ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో చదువుకుని, దేశ రాజకీయాల్లో అగ్రస్థాయి నేతలుగా ఎదిగారు.