Nagarkurnool | నాగర్‌కర్నూల్ : కల్వకుర్తి మండల పరిధిలోని జేపీ నగర్ ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో విషాదం నెలకొంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ కోనేరులోకి పుణ్యస్నానానికి వెళ్లిన విద్యార్థి నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ గురుకులానికి చెందిన రమేశ్(16) ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. అయితే నిన్న శివరాత్రి నేపథ్యంలో వెల్దండలోని శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి టెంపుల్‌కు రమేశ్ తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడున్న కోనేరులో పుణ్యం స్నానం ఆచరించేందుకు రమేశ్ వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో తోటి స్నేహితులు గురుకుల టీచర్లకు సమాచారం అందించారు. పోలీసులు, టీచర్లు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కోనేరులో ఉన్న నీటిని బయటకు తీసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే టీచర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.