హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వృద్ధ మహిళలతో సంఘాలను ఏర్పాటు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. వీటి ఏర్పాటుపై త్వరలోనే సెర్ప్ అధికారులు ఆదేశాలు జారీ చేయనున్నారు. వారి అవసరాలను తీర్చేందుకు అవసరమైన సాయం, సమాచారం ఇచ్చేందుకు ఈ సంఘాలు తోడ్పడనున్నాయి. 60 ఏండ్ల పైబడిన మహిళలతో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇప్పటివరకు 18 నుంచి 60 ఏండ్ల వయసు ఉన్న వారితోనే మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. సదరు వయో పరిమితి దాటిపోయి అనర్హులైన వారికోసం వృద్ధమహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు.