RRR | హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నిర్మించ తలపెట్టిన ప్రాంతీయ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) వ్యవహారం అంతా గప్చుప్ అన్నట్టుగా తయారైంది. దక్షిణ భాగం పనులకు సంబంధించి కొద్దిరోజుల క్రితం వరకు వరుసగా సమావేశాలు నిర్వహించి నేడో రేపో పనులు మొదలవుతాయన్నంతగా హడావుడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. సాధ్యమైనంత త్వరగా అలైన్మెంట్ ఖరారుచేసి ట్రిపుల్ఆర్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన కమిటీ గత నెలరోజులుగా సమావేశం కాకపోవడం పలు అనుమానాలను రేపుతున్నది. మరోవైపు, ఉత్తర భాగం పనులను ముందుకు తీసుకెళ్లాలా? లేదా? అన్నదానిపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఏమీ తేల్చుకోలేకపోతున్నది.
ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనులను ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో, దక్షిణ భాగం పనులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించిన విషయం విదితమే. కానీ, దక్షిణ భాగం నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణలో అడ్డంకులు ఎదురవడంతో గతంలో రూపొందించిన అలైన్మెంట్ను మార్చి, కొత్త అలైన్మెంట్ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీని వెనుక ప్రభుత్వంలోని కొందరు ప్రముఖుల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దాగివున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం రెండు నెలల క్రితం 12 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ట్రిపుల్ఆర్ ప్రాజెక్టు పరిధిలోని 7 జిల్లాల కలెక్టర్లు, రెవిన్యూ, మున్సిపల్ శాఖ, ఆర్అండ్బీ శాఖల కార్యదర్శులు, ఆర్అండ్బీ ఈఎన్సీ, చీఫ్ ఇంజినీర్ తదితరులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఆరంభంలో రెండు మూడు సార్లు సమావేశమైంది.
అనంతరం ప్రభుత్వ సూచనల మేరకు అధికారులు సంబంధిత కన్సల్టెంట్ ఆధ్వర్యంలో అలైన్మెంట్ను ఖరారుచేసి ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పూర్తిగా మౌనం దాల్చింది. గత నెల రోజుల నుంచి ఒక్కసారి కూడా భేటీ కాలే దు. మరోవైపు, భూసేకరణలో అడ్డంకులను అధిగమించేందుకు వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు సమాచారం. దీంతో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూసేకరణ చేపట్టాలని, రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవకుండా చూసేందుకు తగిన ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని కొందరు పెద్దల అనుచరులు భారీగా భూములు కొనుగోలు చేసి, వాటి ధరలు అమాంతం పెరిగేలా ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను రూపొందించినట్టు విమర్శలు చెలరేగాయి.
ఉత్తర భాగం పనులపైనా సందిగ్ధత
వాస్తవానికి భూసేకరణకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం సగం వాటాను భరిస్తే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ట్రిపుల్ఆర్ను నిర్మించాల్సి ఉన్నది. ఈ ప్రాజెక్టు ఉత్తరభాగం పనులకు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. కానీ, ఆ భాగంలో కూడా రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తుండటంతో పనులు ముందుకు సాగడంలేదు. భూసేకరణ పూర్తయితే టెండర్ల ప్రక్రియ చేపడతామని ఎన్హెచ్ఏఐ ప్రకటించి 6 నెలలు దాటినా పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా తయారైంది. ఇప్పటికైనా భూసేకరణ వ్యవహారం కొలిక్కిరాకుంటే కేంద్రం చేతులెత్తేయడం ఖాయమని అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఉత్తర భాగంలో భూసేకరణను వ్యతిరేకిస్తూ గతంలో రైతులు ఆందోళనకు దిగడంతో అలైన్మెంట్ను మార్చుతామని ఆర్అండ్బీ శాఖ మంత్రి హామీ ఇచ్చారు. కానీ, అలైన్మెంట్ మార్పునకు కేంద్రం ఒప్పుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ట్రిపుల్ఆర్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఉన్న ధరల ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చేయడం లేదా ఈ ప్రాజెక్టును వెనక్కి తీసుకోవడం మాత్రమే ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ ముందున్న ప్రత్యామ్నాయాలు. ఒకవేళ రైతులు కొరినంత నష్టపరిహారాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినా ఎన్హెచ్ఏఐ మాత్రం గతంలో నిర్ధారించిన ధర ప్రకారమే తన వాటా చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. పైపెచ్చు ఇప్పుడు ఆందోళన చేస్తున్న రైతులకు అధిక నష్టపరిహారం చెల్లిస్తే గతంలో భూములిచ్చిన రైతులు కూడా తమకు అధిక ధర చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’లా తయారైంది.