హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యాసంగి సాగు రికార్డు స్థాయిలో నమోదైంది. మార్చి నెలాఖరుతో యాసంగి, గతంలో ఎప్పుడూ లేనంతగా 72.63 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ నివేదిక విడుదల చేసింది. ఇందులో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్టు పేర్కొన్నది. ఈ యాసంగి సాగు రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది. మొత్తం సాగు, వరి సాగులో కొత్త రికార్డులు నమోదు చేసింది. ఈ సారి వరి సాగు వానకాలంతో పోటీ పడింది. 2020-21 వానకాలం సీజన్లో మొత్తం 68.17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, వరి 52.30 లక్షల ఎకరాల్లో సాగైంది.
యాసంగిలో వరి రికార్డు సృష్టించగా, మొక్కజొన్న 6.48 లక్షల ఎకరాలు, శనగ 3.64 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.42 లక్షల ఎకరాలు, జొన్న 1.27 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇక యాసంగిలో నిజామాబాద్ జిల్లా 5.09 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసి టాప్లో నిలిచిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత 4.79 లక్షల ఎకరాలతో సూర్యాపేట రెండో స్థానంలో, 4.11 లక్షల ఎకరాలతో కామారెడ్డి మూడో, 3.73 లక్షల ఎకరాలతో సిద్దిపేట నాలుగో, 3.43 లక్షల ఎకరాలతో జగిత్యాల జిల్లా ఐదో స్థానంలో నిలిచింది.